హైదరాబాద్: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 1999, 2004లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2013లో టీఆర్ఎస్లో చేరారు. 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. నోముల నర్సింహయ్య మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.