మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఓ పండుగ అని టీడీపీ సీనియర్ నేత గరిమెళ్ళ గోపాలరావు పేర్కొన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఆయన మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నారు. జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో గరిమెళ్ళ గోపాలరావు మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలోనే తన జీవితం మమేకమైందని పేర్కొన్నారు. అప్పట్లో దశాబ్దాల కాలం కిందట కాంగ్రెస్ పార్టీ పెత్తందారీ విధానాన్ని వ్యతిరేకిస్తూ యుగపురుషుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. పేదలకు కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ ఇవ్వాలనే ప్రధాన లక్ష్యంతో ఎన్టీఆర్ ఆనాడు పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. ఇటువంటి మహోన్నత లక్ష్యాలు గల పార్టీలో తాను సైతం ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏమి పదవులు ఆశించకుండా పనిచేశానన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ స్ఫూర్తితో పసుపు జెండా పట్టుకొని తాను పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించానని వెల్లడించారు.కిలో రెండు రూపాయలకు బియ్యం, పేదలకు ఇళ్ళు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విప్లవాత్మక పరిపాలనకు స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేసిన మహోన్నత నేత దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు వస్తూ ఉన్నారు.. పోతూ ఉన్నారు కానీ, పార్టీ మాత్రం చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, నవ్యాంధ్రప్రదేశ్ ను ప్రగతిపథంలో పయనింప చేశారని పేర్కొన్నారు. టీడీపీ అంటే కేవలం పార్టీ మాత్రమే కాదని తెలుగు ప్రజల గుండె చప్పుడు అని పేర్కొన్నారు. టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి దుష్ట శక్తులు రకరకాల పన్నాగాలు పన్నాయన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సీనియర్ నేత గరిమెళ్ళ గోపాలరావు పిలుపునిచ్చారు. ఈ విషయంలో టీడీపీ శ్రేణులకు ఏ కష్టం ఎదురైనా తాను ముందు వుంటానన్నారు.