తెలుగు తేజం, విజయవాడ : డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గుంటూరు రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ మోతికి వెంకట శివ సత్యనారాయణ వరప్రసాద్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ వివరాలను ఏసీబీ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. మూడు దశాబ్దాల క్రితం డ్రగ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరి.. డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలోనే కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు కూడబెట్టారు. చివరకు ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. 1989 జనవరి 11న వరప్రసాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. 2011న అసిస్టెంట్ డైరెక్టర్‌గా, 2018న డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదు రావడంతో ఏసీబీ బుధవారం ఏకకాలంలో గుంటూరు, విజయవాడ సహా నాలుగు చోట్ల దాడులు నిర్వహించింది.
రిజి్రస్టేషన్ విలువ ప్రకారం రూ.3,43,80,000 విలువైన నాలుగు గృహ సముదాయాలను ఏసీబీ గుర్తించింది. రూ.6 లక్షల విలువైన అపార్టుమెంట్ ఫ్లాట్, రూ.15,64,000 విలువైన మూడు ఇళ్ల స్థలాలు, రూ.1,35,850 విలువైన 2.47 ఎకరాల భూమి, రూ.1,18,580 నగదు, రూ.18 లక్షల విలువైన 1,118 గ్రాముల బంగారం, రూ.15.32 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.50.60 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లున్నట్లు సోదాల్లో తేలింది. మొత్తంగా రూ.3.7 కోట్ల అక్రమాస్తులను గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రసాద్‌ను విజయవాడ ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ తెలిపింది.