ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. కాలుష్యానికి తోడు పెద్ద ఎత్తున పొగమంచు నగరాన్ని కమ్మేస్తున్నది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీలోని పలు నగరాల్లో గాలి నాణ్యత భారీగా పడిపోయింది. పంజాబీ బాగ్‌లో గాలి నాణ్యత సూచీ 460కి చేరింది. ఆనంద్ విహార్‌లో 452, ఆర్కేపురంలో 433గా నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. ఢిల్లీ అంతట గాలి నాణ్యత అధ్వానంగా కొనసాగుతుందని పేర్కొంది. కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని గౌతమ్‌బుద్ధానగర్, ఘజియాబాద్‌లో ఉన్నత పాఠశాలలను మూసివేశారు. రాబోయే ఆరురోజుల పాటు ఢిల్లీలో వాతావరణం మరింత అధ్వాన్నస్థాయికి చేరుకుంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని.. దాంతో కాలుష్యం స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, నవంబర్ 10న ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. 13వ తేదీ వరకు ఉదయం వేళల్లో పొగమంచు పేరుకుపోతుందని పేర్కొంది.