..
తెలంగాణ ప్రభుత్వం పులిచింతల ప్రాజెక్టు నుంచి చట్టవ్యతిరేకంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా వదులుతున్న నీరు ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాజీ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ (కృష్ణా జిల్లా), కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ (గుంటూరు జిల్లా), నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యనమద్ధి పుల్లయ్య చౌదరి (కృష్ణా జిల్లా), రాష్ట్ర నీటి సంఘాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి జాగర్లమూడి. అనిల్ బాబు (ప్రకాశం జిల్లా), కార్యనిర్వాహక కార్యదర్శి తుమ్మల లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులు యన్. కాళికేశ్వరరావు (పశ్చిమ గోదావరి జిల్లా), వీరమాచినేని భవాని ప్రసాద్ (కృష్ణా జిల్లా) తదితరులు విడుదల అవుతున్న నీటిని ప్రకాశం బ్యారేజి దగ్గర పరిశీలించారు. ఇదే విషయమై ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఈరోజు సాయంత్రం సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ నీటిని సముద్రంలోకి విడుదల చేయటం అనైతికమని ఆ వచ్చిన నీటిని కూడా ప్రకాశం బ్యారేజి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నీటి యాజమాన్యం చేయకుండా సముద్రం పాలు చేయడం చాలా దారుణం అని అన్నారు. ఈ వృధా నీటితోపాటు కృష్ణా నది పై నుంచి వర్షం ద్వారా కీసర, మున్నేరు ద్వారా వచ్చే మొత్తం 10 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టా పరిధిలోని కాలువలకు వెంటనే విడుదల చేసి రైతులు నారుమళ్లు పోసుకోవడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీశైలం ఎగువ భాగాన మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు టీఎంసీల తో చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని భూచి గా చూపించి తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎగువ భాగాన సిడబ్ల్యుసి , ఎపెక్స్ కౌన్సిల్, కె ఆర్ ఎం బి నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 కు వ్యతిరేకంగా పాలమూరు 90 టీఎంసీలు, దిండి 30 టిఎంసిలు, మిషన్ భగీరథ 19.59 టిఎంసిలు, భక్త రామదాసు 5.50 టీఎంసీలు, తుమ్మిళ్ల 5.44 టిఎంసిలతో కొత్త ప్రాజెక్టులు ఎస్ ఎల్ బి సి 40 టీఎంసీలు, కల్వకుర్తి 40 టీఎంసీలు, నెట్టెంపాడు 25.40 టీఎంసీలు, మొత్తం 105.40 టీఎంసీల విస్తరణ తో కలిపి 255.53 టిఎంసిల తో కొత్త ప్రాజెక్టులు చేపడితే శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల క్రింద 15 లక్షలు ఆయకట్టు , ప్రకాశం బ్యారేజ్ కింద 13 లక్షలు ఆయకట్టు , ఎస్ ఆర్ బి సి క్రింద రెండు లక్షలు మొత్తం 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు చుక్క కూడా రాదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఈ విపత్కర పరిస్థితుల్లో కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలు అన్నింటిని వెంటనే కృష్ణానది యాజమాన్య బోర్డుల పరిధి లోనికి తీసుకొని సిఐఎస్ఎఫ్ బలగాలతో పహారా ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి, నీటి యాజమాన్యం మొత్తం కేంద్రం అధీనంలోకి తీసుకోవాలని సూచించారు.
ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ లు గుత్తా శివరామకృష్ణ, వై. పుల్లయ్య చౌదరి తదితరులు మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా జిల్లాలో ఉన్న 6.79 లక్షలు, గుంటూరు జిల్లాలో ఉన్న 4 .99 లక్షలు, ప్రకాశం జిల్లాలో ఉన్న 72వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 58 వేల ఆయకట్టుకు రైతుల నారుమడులకు వెంటనే ప్రకాశం బ్యారేజి నుంచి వృధా పోయే జలాలను విడుదల చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.