నెలల వ్యవధిలోనే తల్లి దండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారుల దుస్థితి.
తెలుగు తేజం : మంగళగిరి అభం, శుభం తెలియని ఆ చిన్నారులకు తల్లి దండ్రులు దూరమయ్యారు. భవిష్యత్ కు అండగా వుంటూ కను రెప్పలా కాపాడాల్సిన వారిని మృత్యువు కాటేసింది. ఈ పరిస్థితుల్లో దిక్కు లేక ఆదరించే వారు లేక ఆ చిన్నారులు బిక్కు బిక్కు మంటూ కన్న ప్రేమ కరువై తల్లడిల్లిపోతున్నారు.
మంగళగిరి పట్టణం లోని రత్నాల చెరువులో పులివర్తి అనిల్(26) గత కొద్ది రోజుల క్రితం ఓ భవనంలో తాపీ పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. అనారోగ్యంతో అతని భార్య కొద్ది నెలల క్రితం మృత్యువాత పడింది. వీరికి నందిని అనే ఏడేళ్ల పాప, భువన శ్రీ అనే ఐదేళ్ల పాప వున్నారు. తల్లి దండ్రులిద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లటంతో ఆ చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది.
చిన్నారుల అమ్మమ్మ అతి కష్టం మీద వారి పోషణ చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో నాయకులు స్పందించి వారి పోషణ చదువుకు అయ్యే ఖర్చులు భరిస్తే చిన్నారుల భవిష్యత్ కు బంగారు బాటలు వేసిన వారవుతారు. పసి హృదయాలకు అండగా నిలిచిన వారవుతారు.