దేవ దీపావళిని ఆరంభించిన మోదీ, విశ్వేశ్వర లింగానికి పూజలు
వారణాసి: పరమ పవిత్రమైన కాశీ మహాక్షేత్రం దీప కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోయింది. గంగానది ఘాట్ల వద్ద వెలిగించిన 15 లక్షల దీపాలతో వారణాసి నగరం మిరుమిట్లు గొలిపింది. ప్రధాని నరేంద్రమోదీ మొదటి దీపాన్ని వెలిగించి ‘దేవ దీపావళి’ వేడుకను ఆరంభించారు. ఆయన వెంట ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోదీ తర్వాత ఘాట్లలో ఏర్పాటు చేసిన దీపాలను అనేక మంది భక్తులు వెలిగించారు. ఆ కాంతుల నడుమ కాశీని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు!
ఏటా కార్తీక పౌర్ణమి రోజున కాశీలో దేవ దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట కాశీ విశ్వేశ్వర లింగానికి ఆయన పూజలు చేశారు. వేద పండితులు ‘శ్రీ రుద్రం’ చదవగా గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పండ్లరసాలతో మహాదేవుడిని అభిషేకించారు. ఆ తర్వాత రాజ్‌ఘాట్‌కు వెళ్లి మొదటి దీపాన్ని వెలిగించి దేవ దీపావళిని ఆరంభించారు. కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షోను వీక్షించారు. గంగా నదిలో బోటులో విహరిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అంతకుముందు ఆయన సంత్ రవిదాస్‌కు నివాళి అర్పించారు.
కొవిడ్-19 వల్ల దేశంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ కాశీ ప్రభ, భక్తి, శక్తిలో ఎలాంటి మార్పులేదని మోదీ అన్నారు. వందేళ్ల క్రితం చోరీకి గురైన అన్నపూర్ణా మాత విగ్రహాలు తిరిగి భారత్‌కు వస్తున్నాయని తెలిపారు. ఇదో గొప్ప అదృష్టంగా పేర్కొన్నారు. ఆ విగ్రహాలు మన అమూల్యమైన వారసత్వంలో భాగమని వెల్లడించారు.