తెలుగు తేజం, మంగళగిరి: మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, రత్నాల చెరువు ప్రాంతాలలో నకిలీ సర్వే నెంబర్లు వేసి అక్రమంగా స్థలాలు విక్రయించే వారి ఎడల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ శ్రీమతి హేమమాలిని విజ్ఞప్తి చేశారు. రత్నాల చెరువు ప్రాంతంలో రెవిన్యూ అధికారులు కొంతవరకు మాత్రమే పట్టాలు అందజేయడం జరిగిందని, అయితే ప్రస్తుతం కొంతమంది నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు విక్రయించి, ప్రజలను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సర్వే నంబర్లపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారని, స్థలం కొనుగోలు చేసేటప్పుడు నగరపాలక సంస్థలో ఆ ఏరియాల సర్వే నెంబర్లు తీసుకుంటే, అక్కడ ఉన్న నకిలీ నంబర్లు తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వ స్థలంను అక్రమంగా కొనుగోలు చేసిన, అమ్మినా ఆ స్థలం స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని, కావున ప్రజలు నష్ట పోకుండా జాగ్రత్తగా స్థలాలను కొనుగోలు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.