నర్సాపురం : టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో యువనేత పాదయాత్ర సాగుతోంది. ఈరోజు నరసాపురం మండలం సీతారామపురం నుంచి 207వ రోజు పాదయాత్రను లోకేశ్ మొదలుపెట్టారు. నర్సాపురంలో యువగళానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. యువనేత లోకేశ్‌కు నర్సాపురం పట్టణ ప్రజల అపూర్వ స్వాగతం పలికారు. అడుగడగునా యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పలుకుతున్నారు. యువనేతకు సంఘీభావంగా భారీగా రోడ్లవెంట ప్రజలు బారులు తీరారు. లోకేశ్‌ను కలిసి ఫోటోలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడుతున్నారు. భవనాలపై నిలబడి యువనేతకు స్థానికులు అభివాదం తెలుపుతున్నారు. వివిధ వర్గాల ప్రజలు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నర్సాపురం జగన్నాథ ఆలయం సమీపంలో చేనేత కార్మికులు లోకేశ్‌ను వినతిపత్రం అందజేశారు. చేనేతల కుటుంబసభ్యులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత సొసైటీలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని వినతి చేశారు. ఎన్టీఆర్ హయాంలో మాదిరి జనతా వస్త్రాల పంపిణీ చేపట్టి చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని చేనేత కార్మికులు కోరారు.
నారా లోకేశ్ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చేనేత కార్మికులకు రూ.110 కోట్ల రుణమాఫీ చేసి ఆదుకున్నామన్నారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేసి సంక్షేమ పథకాలన్నీ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేసేలా కేంద్రంతో మాట్లాడతామని, వీలుపడకపోతే రాష్ట్రమే జీఎస్టీ భరించేలా చేస్తామన్నారు. మగ్గం ఉన్న ప్రతీ చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని యువనేత హామీ ఇచ్చారు.