నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో తెరాస విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లకు గానూ తెరాస 728 ఓట్లు కైవసం చేసుకోగా.. భాజపా 56, కాంగ్రెస్ 29 ఓట్లు దక్కించుకుంది. 10 చెల్లని ఓట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతుతోపాటు ఇతర పార్టీల నుంచి వలసలు కూడా ఎక్కువగా ఉండటంతో మొదట్నుంచీ ఊహించినట్లుగానే కవిత ఘనవిజయం సాధించారు. ఎన్నికకు ముందు తెరాసకు కేవలం 505 మంది మద్దుతు మాత్రమే ఉండేది. కానీ, ఎన్నికల్లో 728 ఓట్లు సాధించడంతో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ నుంచి దాదాపు 100 మందికి పైగా ప్రతినిధులు తెరాసకు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు రౌండ్లలో ఓట్లు లెక్కించాల్సినప్పటికీ.. తొలి రౌండ్లోనే ఫలితం తేలిపోయింది. మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కించగా 531ఓట్లు తెరాసయే కైవసం చేసుకోవడంతో కవిత విజయం అప్పుడే ఖరారైపోయింది.