హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ శుక్రవారం ప్రారంభం కానుంది. తొమ్మిదిరోజుల పాటు (ఈనెల 24 వరకు) ఈ పండుగ జరుగుతుంది. శతాబ్దాల చరిత గల బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మహిళలు, యువతులు, బాలికలకు ప్రీతిపాత్రమైన ఈ పండుగలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారు. చివరిరోజు సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. ఈసారి కరోనా, వర్షాల ప్రభావం బతుకమ్మల మీద పడనుంది. ఈ కారణంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. ఇళ్ల వద్దనే పండుగ జరుపుకోవాలని భావిస్తోంది. జాగ్రత్తలు పాటించాలి: ఎమ్మెల్సీ కవిత
బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులంతా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. ఆమె గురువారం ‘ఈనాడు’తో మాట్లాడారు. ప్రత్యేక పరిస్థితుల మధ్య పండుగ జరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ మూడు వీడియో పాటలను, 9 పాటలతో కూడిన సీడీని విడుదల చేసింది.