తెలుగు తేజం విజయవాడ:వన్‌టౌన్ బ్రాహ్మణవీధిలో వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఉభయదేవేరులతో కూడిన స్వామి వారి తెప్పోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళవాయిద్యాలతో కృష్ణానదికి తీసుకువెళ్లారు. అక్కడ రమణీయంగా అలంకరించిన ఫంట్‌పై స్వామి వారి ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి నదిలో విహరింపజేశారు. నదిలో మూడు సార్లు ప్రదక్షణ చేయించారు. అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలతో తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు.
చక్రతీర్ధ స్నానం:
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామి వారి చక్రతీర్ధ స్నానం వైభవంగా నిర్వహించారు. శ్రీహరి నామస్మరణ మధ్య శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తులను మేళతాళాలతో కష్ణానది ఒడ్డున దుర్గాఘాట్‌కు తీసుకెళ్లారు. అక్కడ స్వామి వారి చక్రతీర్ధ స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ ఆగమ పండితులు పరాశరం రంగనాధాచార్యుల పర్యవేక్షణలో ఆలయ అర్ఛకస్వాములు ఈ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఘనంగా అశ్వవాహన సేవ
శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ఆశ్వవాహనంపై ఊరేగిన స్వామివారికి తిరుమంగై ఆళ్వార్ చోర సంవాదం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చోరసంవాద కార్యక్రమాలను అర్ఛకస్వాములు చక్కగా నిర్వహించారు. భక్తులకు తిరుమంగై ఆళ్వార్ కథను వివరించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి గెల్లి హరిగోపీనా«ద్‌బాబు పర్యవేక్షించారు. వైధిక కార్యక్రమాలను అర్ఛకస్వాములు పరాశరం మురళీకృష్ణమాచార్యులు, పొన్నంగిపల్లి శ్రీరామచంద్రమూర్తిలు నిర్వహించారు.