అమరావతి టు అరసవల్లి వరకు జరుగుతున్న రాజధాని రైతుల పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవటం భావ్యం కాదని, పాదయాత్రను అడ్డుకోవడం అంటే వరద ప్రవాహానికి చేతులతో అడ్డు కోవాలకోవటమే అని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభివర్ణించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగర్ మీదుగా పాదయాత్రను పోనివ్వకుండా, స్థానిక ఎమ్మెల్యే పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని, కృతజ్ఞతా భావంతో పోలీసులు పాదయాత్రకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారని చెప్పారు. ఇలాంటి స్వామి భక్తి కార్యక్రమాలకు పుల్ స్టాప్ పెట్టి, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించాలని సూచించారు. ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆటంకం కలిగించకుండా, ఎలా సహకరించిందో, అదే తీరుగా వైకాపా ప్రభుత్వం రైతులు చేపట్టిన అరసవల్లి పాదయాత్రకు సహకరించాలన్నారు. పాదయాత్ర పై మంత్రులు ఎంత పరుషంగా, నీచంగా దాడి చేస్తే,వారికే అంత నష్టమని స్పష్టం చేశారు. మంత్రులు మోకాళ్ళ వరకు చూసుకొని మాట్లాడ వద్దని, ముందు చూపుతో మాట్లాడితే మంచిదని హెచ్చరించారు.