న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా ఆరోపణలకు సంబంధించి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు చెందిన 26 కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. దాదాపు 9 రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. పీఎఫ్ఐ చైర్మన్ ఓఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర పీఎఫ్ఐ చీఫ్ నసారుద్దీన్ ఎల్మరామ్, పీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అబ్దుల్ వాహిద్‌ల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు చేశారని పీఎఫ్ఐ పేర్కొంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముర్షీదాబాద్, లక్నో, ఔరంగాబాద్, జైపూర్, కొచ్చి, మలప్పురం తదితర నగరాలతోపాటు ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో దాడులు చేసింది. నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి సాక్ష్యాలను సంపాదించేందుకు సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్, బెంగళూరులో పోలీస్ స్టేషన్లపై దాడి, హాథ్రస్ హత్యాచారం తరువాత నిధుల లావాదేవీలు.. తదితర నేరాల వెనుక పీఎఫ్ఐ హస్తం ఉందన్న ఆరోపణలపై కూడా ఈడీ విచారణ చేస్తోంది.