మెజార్టీ డివిజన్లలో బీజేపీ ఆధిక్యం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. మెజార్టీ డివిజన్లలో టీఆర్ఎస్పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్లో మొదటి స్థానంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు రాబట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్యాలెట్ ఓట్లలోనూ కాషాయదళం ఇదే రీతిలో ఓట్లను దండుకుంటే.. మేయర్ పీఠం దక్కించే అవకాశం సైతం లేకపోలేదు. కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 40శాతం ఓట్లు చెల్లని ఓట్లుగా కౌంటింగ్ అధికారులు గుర్తించారు. మరోవైపు బ్యాలెట్ పత్రాల లెక్కింపులో బీజేపీ అనూహ్య రీతిలో పుంజుకుంది. ఇప్పటి వరకు 88 డివిజన్లో బీజేపీ ముందంజలో ఉండగా.. 30 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఎంఐఎం 17, కాంగ్రెస్ 02 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో కమలదళం జోరు కొనసాగిస్తోంది. మరికాసేపట్లో తొలి ఫలితం విడుదల కానుంది.