60 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపాలని విజ్ఞప్తి
తెలుగు తేజం , అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి టీకా ఉత్సవ్ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రానికి మరో 60 లక్షల కోవిడ్ టీకా డోసులను పంపాలని కోరారు. అంతేకాకుండా ఈ నెల 9వ తేదీన రాసిన లేఖకు స్పందించి ఏపీకి 6 లక్షల టీకా డోసులను పంపించినందుకు ప్రధాని మోదీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. అటు టీకా ఉత్సవ్‌లో భాగంగా 14వ తేదీన ఒక్క రోజే ఏపీలో 6.28 లక్షల మందికి టీకా వేసినట్లు ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.
కాగా, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని.. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ డోసులు ఇచ్చామని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ఇదంతా కూడా గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా పరీక్షల సంఖ్య పెంచామని, ఏ లోటు లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. 50 కుటుంబాలకు ఒకరిని చొప్పున నియమించిన వాలంటీర్ల ద్వారా ప్రతీ వ్యక్తికి వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని.. వచ్చే మూడు వారాల్లో 45 సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరికి టీకా వేస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఏపీకి 60 లక్షల డోసులు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం జగన్ కోరారు.