గూడ్స్ రైలుకింద పడి బలవన్మరణం.. కర్నూలు జిల్లాలో ఘటన
పాణ్యం (కర్నూలు జిల్లా): ఆ ఇంటి యజమాని షేక్ అబ్దుల్ సలామ్‌ను వరుస అవమానాలు, కష్టాలు వెంటాడాయి. మొదట్లో అతడు బంగారం దుకాణంలో గుమాస్తాగా పని చేసేవాడు. తనకు తెలిసిన వారితో అగ్రి గోల్డ్ డిపాజిట్లు చేయించాడు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో పరువు కాపాడుకునేందుకు తన ఆస్తి అమ్మేసి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించాడు. గత ఏడాది నవంబర్ 7వ తేదీన అతడు పని చేస్తున్న దుకాణంలో బంగారం చోరీ చేశాడని నంద్యాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా అతడు ఓసారి ఆత్మహత్యా యత్నం చేశాడు. అప్పట్లో అతని నుంచి 500 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. చివరకు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అక్కడా అతడిని విధి చిన్నచూపు చూసింది.
రెండ్రోజుల క్రితం అతడి ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రూ.70 వేలు పోగొట్టుకున్నాడు. ఆ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు సోమవారం అబ్దుల్ సలామ్‌ను స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకున్నాడు. భార్య, ఇద్దరు బిడ్డల ప్రాణాలను సైతం తనతో తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అంతా కలసి రైలు పట్టాలను ఆశ్రయించారు. వారి మీదనుంచి గూడ్స్ రైలు దూసుకుపోయింది. నలుగురి ప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి. కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని కౌలూరు గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల మూలసాగరం ప్రాంతానికి చెందిన అబ్దుల్సలామ్ (45) తన భార్య నూర్జహాన్ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలంధర్ (10)తో కలిసి మంగళవారం గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.