దిల్లీ: దేశంలో కరోనా మళ్లీ తీవ్రరూపం దాలుస్తోంది. గతవారంతో పోలిస్తే ఇప్పుడు కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మళ్లీ 40వేలకు పైన కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేగాక, నిన్న కోలుకున్నవారి కంటే కొత్త కేసులే ఎక్కువ కావడం గమనార్హం. ఇక మొత్తం కేసుల సంఖ్య కూడా 92లక్షలను దాటింది.
మంగళవారం కొత్తగా 44,376 వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 92,22,217కు పెరిగింది. ఇదే సమయంలో మరో 37,816 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 86,42,771కి చేరగా.. రికవరీ రేటు 93.72శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల రేటు 4.82శాతంగా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో మరో 481 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,34,699కి పెరిగింది. భారత్‌లో మరణాల రేటు 1.46శాతంగా ఉంది. మంగళవారం దేశవ్యాప్తంగా 11,59,032మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 13,48,41,307 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.