దిల్లీ: దేశానికి ఎలాంటి ముప్పు ఎదురైనా దీటుగా స్పందించడానికి భారత్ అన్ని విధాలా సమాయత్తమవుతోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పిన భారత్.. అందుకు అనుగుణంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగా భారత వాయుసేన అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రాన్ని పరీక్షించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన యాంటీ రేడియేషన్ క్షిపణి ‘రుద్రం-1’ ని భారత్ పరీక్షించింది. బాలాసోర్‌లో సుఖోయ్-30 నుంచి ప్రయోగించిన ఈ అస్త్రం నిర్దేశిత లక్ష్యాలను ఛేదించింది. ఈ క్షిపణి భారత వాయుసేనను మరింత బలోపేతం చేయనుంది. శత్రు రాడార్లు, ట్రాకింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలకు నాశనం చేసేందుకు దీనిని అభివృద్ధి చేశారు.
క్షిపణి ప్రయోగం విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ”నవతరం యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం-1 పరీక్ష విజయవంతమైంది. డీఆర్‌డీవోతోపాటు క్షిపణి అభివృద్ధిలో పాల్గొన్న అందరికీ అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు.
వరుస క్షిపణి ప్రయోగాలు
భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ వరుస క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే నాలుగు క్షిపణులను పరీక్షించిన భారత్.. నిర్భయ మిసైల్‌ను భారత్-చైనా సరిహద్దులకు కూడా తరలించింది. మరోవైపు 700 కి.మీ ల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యమున్న శౌర్య క్షిపణులను సైతం వినియోగించుకునేందుకు మోదీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. అంతేకాకుండా స్మార్ట్ టార్పిడో క్షిపణిని కూడా పరీక్షించింది. వీటితోపాటు హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోనిస్ట్రేటర్ వెహికల్ (హెచ్‌ఎస్‌టీడీవీ)ని కూడా భారత్ ప్రయోగించింది. ఇది సుదూరాల్లోని లక్ష్యాలను ఛేదించే క్రూజ్ క్షిపణులు, హైపర్ సోనిక్ క్షిపణులను మోసుకెళ్తుంది.