తెలుగు తేజం, అమరావతి: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఎస్ఈసీ, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు స్పష్టంచేశారు. ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడకుండా నిలువరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యేమార్గంగా తగిన ఉత్తర్వులు జారీచేస్తామని హైకోర్టు నిన్న తెలిపింది. ఈ మేరకు గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
నిన్న జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల నిర్వహణ విషయంలోనే ఎన్నికల కమిషనర్‌కు విస్తృత అధికారాలు ఉంటాయి గానీ, వాక్ స్వాతంత్య్రాన్ని హరించేలా ఉత్తర్వులివ్వడానికి వీల్లేదు’ అన్నారు. ఎస్ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘మంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగసంస్థ అయిన ఎస్ఈసీని గౌరవించాలి. మంత్రి వ్యాఖ్యలు ప్రజల్లో ఎస్ఈసీ అసమర్థులనే భావన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడకుండా మంత్రిని నిలువరించాల్సి వచ్చింది’ అని తెలిపారు.