తెలుగు తేజం నందిగామ: నందిగామ నెహ్రూ నగర్ లో గల మండల పరిషత్ పాఠశాల నందు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నందిగామ దిశ ఎస్ ఐ రమణ, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వాసంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసంతి మాట్లాడుతూ దేశం లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్తున్నారని, విద్యార్థులు విద్యార్థి దశ నుంచి ఉన్నతమైన ఆలోచనలు, లక్ష్యాలు కలిగి ఉండాలని, ఆ దిశగా తమ ప్రయాణాన్ని కొనసాగించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ మనోవేదన గురికాకుండా ఆటుపోట్లను ఎదుర్కొని, ధైర్యంగా ముందుడుగు వేయాలని తెలిపారు. దిశా ఎస్సై రమణ మాట్లాడుతూ మహిళా భద్రత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఆ కార్యక్రమలలో భాగంగానే ప్రత్యేకంగా మహిళల కోసం దిశ పోలీస్ స్టేషన్, మహిళ పోలీసులను ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సమయంలో దిశా యాప్ ద్వారా మీ మొబైల్లో లొకేషన్ సెండ్ చేస్తే, అక్కడికి వెంటనే పోలీసులు చేరుకొని ఎటువంటి సంఘటనలు జరగకుండా చూస్తారని, దిశ చట్టం గురించి విద్యార్థులకు వివరించారు. స్కూల్ హెడ్మాస్టర్ రత్నమ్మ మాట్లాడుతూ నేడు మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నరని, అన్ని రంగాలలో కూడా తమ ఉనికిని చాటి చెబుతున్నారని అన్నారు. అనంతరం విద్యార్థులచే అమ్మకు పూలతో పాదాభివందనం చేయించారు. ముఖ్య అతిథులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతం పలికి సత్కరించారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు , వారి మాతృమూర్తులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధ్యాపకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రత్నమ్మ, స్వర్ణలత, రాజేశ్వరి, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు విద్యార్థినీ విద్యార్థుల తో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.