విజయవాడ రూరల్ (తెలుగు తేజం ప్రతినిధి):రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఒక పథకం ప్రకారం అన్నీ స్కీములను నిర్వీర్యం చేస్తున్నదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. సోమవారం గొల్లపూడి కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మండల మైనార్టీ అనుబంధ విభాగం ను ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఎన్నికల సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి హామీలు ఇచ్చిన సందర్భంగా ఒక్కటి కూడా నెరవేర్చక నీరుగార్చారని తెలిపారు. ముస్లిం యువతకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని నమ్మించి మోసం చేశారు. అదే విధంగా మైనార్టీ సబ్ ప్లాన్‌తో పాటు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారు. ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా నిధులను విడుదల చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా రంజాన్ తోఫా, ముస్లిం యువతకు దులహన్ పథకం ద్వారా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 50 వేల రూపాయలు ఇస్తున్న పథకానికి ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇది చాలదు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు. విదేశీ విద్యావిధానం నిర్వీర్యం చేశారని, కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం కూడా రద్దు చేశారని గుర్తు చేశారు. రంజాన్ పండుగ సమయాలలో మసీదులకు మరమ్మతులు చేస్తామని అది కూడా అమలులోకి తీసుకు రాలేదని విమర్శించారు. షాదీఖానాలు ప్రతి గ్రామానికి ఒకటి కట్టి ఇస్తామని అమలు చేయలేని హామీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చారని తెలిపారు. కబరస్తాన్ (స్మశానాలు)లకు ప్రహారీ గోడలు కట్టి, నీటి సదుపాయం కల్పిస్తామని చెప్పి పూర్తిగా మర్చిపోయారని తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ జిలాని భాష ఉపాధ్యక్షులుగా షేక్ కాజా షేక్ ప్రధాన కార్యదర్శిగా షేక్ గాలీ షహీద్ ను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు షేక్ కరీముల్లా, విజయవాడ పార్లమెంటు మైనార్టీ సెల్ అధ్యక్షులు కరీముల్లా, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరీముల్లా, ముస్లిం మైనార్టీ నేతలు షేక్ మహబూబ్ సుభాని, షేక్ ఖాజా మొహిదీన్, షేక్ అప్సర్ తదితులు. పాల్గొన్నారు.