తెలుగుతేజం, మంగళగిరి: ఓ పాలక పక్ష పార్టీ ఎమ్మెల్యే పొలం నాసిరకపు విత్తనాల వల్ల ఎండిపోతే , అది ప్రభుత్వ రంగ విత్తన సంస్థ కావడంతో వారి నిర్వాకం ఎత్తి చూపితే దాదాపు ప్రభుత్వ డొల్లతనం బయటపడినట్లే. ఒక ఎమ్మెల్యేకు దిక్కు లేకపోతే సాధారణ రైతుకి అలాంటి విత్తనాల వల్ల ఎంత నష్టం జరిగిందో? వారి వ్యధను పట్టించుకున్నవారెవరో తెలియని స్థితిలో ఇదో అద్భుతమైన రైతు సమస్య. రాష్ట్రవ్యాప్తంగా ఎంత మందికి నష్టం జరిగిందో ఎమ్మెల్యే మోసపోయినట్లుగా ఏపీ సీడ్స్ వాళ్ళ ఎందరి పొలాలు డొల్లబారి పోయాయో తెలుసుకుంటే ఓ పెద్ద రైతు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజల మన్ననలు పొందే వీలుండేది… కానీ దురదృవశాత్తు ఏపీ రాజకీయాల్లో అలాంటి వాటిని కనీసం ఊహించలేం.
ఒక స్పందన లేదు
ఎమ్మెల్యే తరఫున 26 వ తేదీన వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే కొన్ని పత్రికల్లో డీసీ వార్త వచ్చింది. దీనిపై స్పందన, ఏపీ సీడ్స్ వ్యవహారం, రైతుల నష్టం మీద 27 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన గాని, నిరసన గాని ప్రతిపక్షం తెలపలేదు. కనీసం నాయకుల ప్రెస్ నోట్ విడుదలలు లేవంటే ఆంధ్ర రాజకీయాల్లో పరిస్థితి అర్ధం చేస్కోవచ్చు. కేవలం వ్యక్తిగత దాడులకు రోడ్డెక్కడం, వారి మీద వీరు తిట్టిపోసుకువడం తోనే రాజకీయాలు సాగిపోతున్నాయి. ప్రతిపక్షం లో ఉన్న టీడీపీ బీజేపీ నే కాదు ప్రజాపోరాటాలు చేస్తామని చెప్పుకునే వామపక్షాలు, జనసేన లాంటి పార్టీలకు ఈ సమస్య అర్ధం కాకపోవడం విశేషమే.
మీకు మీరే రక్షా??
స్వీయ పోరాటాలు ఆరాటాలు తప్ప ప్రజా పక్షాన పోరాడే ఉద్దేశాలు, తీరిక ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పార్టీలకు లేనట్లే కనిపిస్తుంది. ప్రజలు దేని మీద ఇబ్బంది పడుతున్నారు.? ఎలాంటి విషయాలు ప్రజలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయో కచ్చితంగా అంచనా వేసి పోరాడితే ఏ పక్షానికి ఐనా ప్రజా మద్దతు ఉంటుంది. ESI స్కాం విషయంలో, ఓ హత్య కేసులో సంబంధం ఉందని ఆరోపణలతో టీడీపీ మాజీ మంత్రులు అరెస్టు అయినపుడు వెంటనే రోడ్డెక్కి కులం కార్డు తగిలించుకుని రోడ్డెక్కిన ప్రతిపక్ష పార్టీలకు ప్రస్తుత రైతు వ్యవహారం మాత్రం గిట్టనిది అయిపొయింది. జగన్ ప్రభుత్వం వ్యక్తిగత దాడులు చేస్తుంది అని ప్రాజెక్ట్ చేయడానికి పెట్టె దృష్టిలో ఒక 10 శాతం ఐనా రైతు సమస్యల మీద పెడితేనే ప్రతిపక్షాన్ని కనీసం ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది.
ఏపీ సీడ్స్ కథ ఏంటీ ?
ఆంధ్ర ప్రదేశ్ విత్తనాభివృద్హి సంస్థ (ఏపీ సీడ్స్) వరిలో 21 రకాల విత్తనాలను అందిస్తుంది. వరి విషయంలో గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణ, గుంటూరు జిల్లాలే ఎక్కువ దిగుబడి తీసుకొస్తాయి. దాదాపు 75 శాతం మంది రైతులు ఈ జిల్లాల్లో సొంతంగా ధాన్యాన్ని కొంతమేర ఉంచుకుని దాన్ని వచ్చే పంటకు నారుపోస్తారు. మిగిలిన వారిలో నాణ్యమైన పంట కోసం విత్తనాభివృద్ధి సంస్థ రాయితీ మీద విత్తనాలు ఇస్తుంది. ఇవి అత్యంత నాసిరకంగ ఉన్నాయని 2018 లో రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్సు చేసిన దాడుల్లో బహిర్గతం అయ్యింది. అయినా దాని ప్రక్షాళనకు అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, ఆ ఫైల్ అటకెక్కింది. సీడ్స్ నాణ్యత చూడాల్సిన విభాగం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అని విజిలెన్సు నివేదికలు ఇచ్చిన వాటిని మరుగున పెట్టారు. తాజాగాఈ అంశంలో అయినా జగన్ సర్కారు ద్రుష్టి పెడితే చెడు లోను ప్రభుత్వానికి మంచి జరిగే అవకాశం ఉంది.