ఆర్థిక ఇబ్బందులు.. అప్పులతో బ్యాంకుపై కన్ను
నిందితుల అరెస్టు.. రూ.77 లక్షల సొత్తు స్వాధీనం
వివరాలు వెల్లడించిన రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ
గుంటూరు: దాచేపల్లి మండలం నడికూడి ఎస్బీఐ బ్రాంచి చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ గాంధీనగర్‌కు చెందిన కేదారి ప్రసాద్, వినయ్రాములు స్నేహితులు. ఆర్థిక సమస్యలు, అప్పులు ఉండటంతో ఒకసారి పెద్ద దొంగతనం చేసి జీవితంలో స్థిరపడాలనుకున్నారు. ఇంటర్ చదువుకున్న ప్రసాద్ యూట్యూబ్‌లో బ్యాంకు చోరీ చేయడం ఎలా, పోలీసులకు దొరక్కుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూసి…అలా పథకం రచించాడు. ఇద్దరూ కలిసి బ్యాంకు వద్ద రెక్కీ నిర్వహించారు. ఇద్దరూ కలిసి బ్యాంకు వద్ద రెక్కీ నిర్వహించారు. ఈనెల 21న బ్యాంకులోని రూ.77 లక్షల నగదు చోరీ చేశారు. సీసీ కెమెరాలు తొలగించి, గ్యాస్ కట్టర్ ఉపయోగించి లాకర్ తెరవడంతోపాటు పోలీసు జాగిలాలు వాసన పసిగట్టకుండా కారంపొడి చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఘటన జరిగిన తీరును బట్టి తొలుత నేరాలు చేయడంలో బాగా ఆరితేరిన వారు చేసిన పనిగా భావించారు.
లోతుగా దర్యాప్తు చేయగా ఇద్దరూ కొత్త నేరస్థుల పని అని తేలింది. ఎనిమిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఘటనాస్థలిలో లభించిన ఆధారాల ప్రకారం దర్యాప్తు చేయగా ప్రసాద్, వినయ్రాములు యూట్యూబ్ చూసి చోరీ చేసినట్లు నిర్ధారణయ్యిందన్నారు. 72 గంటల్లో నేరస్థులను అరెస్టు చేయడంతోపాటు రూ.77 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.