అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. భారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు రాబోయే 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణశాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలోకి వస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కి.మీటర్లు, నర్సాపూర్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 360కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్-విశాఖపట్నం మధ్య కాకినాడకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.