అమరావతి : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, వెలుస్తున్న అనధికార లే అవుట్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. పట్టణ స్థానిక సంస్థలు (యు.ఎల్.బి.లు), పట్టణాభివృద్ధి సంస్థ (ఉడా)ల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొత్తం సుమారు 52,509 అనధికార కట్టడాలను అధికారులు గుర్తించారు. అలాగే 10,477 అక్రమ లే అవుట్లు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. వీటిలో అత్యధికంగా ఏఎంఆర్డీఏ (పాత ఏపీసీఆర్డీఏ) పరిధిలోనే 1306 అక్రమ వెంచర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కోసం వాస్తవానికి గత నెల మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు ఇచ్చిన 15 పనిదినాల గడువులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20,745 అనధికార నిర్మాణాలు, 691 అక్రమ లే అవుట్లను మాత్రమే టౌన్ ప్లానింగ్ విభాగం గుర్తించింది. ఈ సంఖ్య చాలా తక్కువని భావించిన ఉన్నతాధికారులు గడువును మరో 15 రోజులపాటు… అంటే ఈ నెల 9 వరకూ పొడిగించారు. తూతూమంత్రంగా ఈ కార్యక్రమాన్ని సాగించి, చేతులు దులుపుకోరాదంటూ పురపాలక శాఖ, డీటీసీపీ ఉన్నతాధికారులు పట్టణాభివృద్ధి సంస్థలు, ‘ఉడా’లను ఎప్పటికప్పుడు అప్రమత్తంచేస్తూ వచ్చారు. తత్ఫలితంగానే గతంతో పోల్చితే గణనీయంగా అక్రమ నిర్మాణాల సంఖ్య పెరిగింది. క్షేత్రస్థాయిలో వాటి సంఖ్య ఇంకా చాలా ఉంటుందని తెలుస్తోంది. బిల్డర్లు, రియల్టర్లు, డెవలపర్లు, వ్యక్తిగత నిర్మాణదారులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్న కొందరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిర్వాకమే ఇందుకు కారణమని వినవస్తోంది.