దిల్లీ: కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థికవ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు మరో బృహుత్తర కార్యకమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అనేక ప్రణాళికలు, కొత్త పథకాలు తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వెల్లడించారు. మూలధన ప్రాజెక్టుల నిమిత్తం రాష్ట్రాలకు రూ. 12 వేల కోట్ల వడ్డీలేని రుణం ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
ఈ ప్యాకేజీలో ఈశాన్య రాష్ట్రాలకు రూ. 1600కోట్లు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు కలిపి రూ. 900కోట్లు, మిగతా రాష్ట్రాలకు రూ. 7500 కోట్లు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మిగతా రూ. 2000కోట్లు కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలను అమలు చేసే రాష్ట్రాలకు ఇస్తామని చెప్పారు. కొత్త లేదా ప్రస్తుతం కొనసాగుతున్న మూలధన ప్రాజెక్టుల ఖర్చులకు రాష్ట్రాలు ఈ రుణాలను వినియోగించుకోవచ్చని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంటే ప్రాజెక్టు కాంట్రాక్టర్లు, సప్లయర్ల బిల్లులను రాష్ట్రాలు ఈ రుణంతో చెల్లించుకోవచ్చు. అయితే అవన్నీ 2021 మార్చి 31లోగా చెల్లించాల్సి ఉంటుంది అని ఆర్థిక మంత్రి తెలిపారు. అంతేగాక.. ఈ రుణానికి ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. 50ఏళ్ల తర్వాత రాష్ట్రాలు ఈ అప్పు చెల్లించాలి అని ఆమె వెల్లడించారు.