వాట్ సప్ ద్వారా హవాలా లావా దేవీలు
రూ. 10 చూపిస్తే కోటి ఇస్తారు
తెలుగు తేజం, విజయవాడ : విజయవాడలో చాప కింద నీరులా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న హవాలా రాకెట్‌లో విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెందించారు.ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా రూ.కోట్ల మేర నగదును విజయవాడ నుండి దేశంలో ఎక్కడికైనా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంతకల్‌కు హవాలా ద్వారా పంపించేందుకు సిద్ధంగా ఉన్న రూ.కోటి నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వాట్సాప్ గ్రూపు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా హవాలా ముఠా నిర్వహిస్తున్న ఈ లావాదేవీలను పోలీసులు రట్టు చేశారు.
ఈ హవాలా లావాదేవీలన్నీ వాట్సాప్‌లోనే జరుగుతుంటాయి. ముందుగా ముఠా సభ్యులంతా ఒక వాట్సాప్ గ్రూపుగా ఏర్పడతారు. ముందుగా ఆ డబ్బును ఒక చోటకు చేరుస్తారు. ఆ తర్వాత ఎవరికి, ఎలా ఇవ్వాలో ప్రధాన సూత్రధారి నిర్ణయిస్తారు. డబ్బును ఎవరు తీసుకుంటారో.. వారికి ఒక రూ.10 నోటు ఇస్తారు. దీనికి ముందు ఆ నోటు ఫొటో తీసి హవాలా సభ్యుడికి వాట్సాప్ ద్వారా పంపిస్తారు. రూ.10 నోటు తీసుకున్న వ్యక్తి తనకు కావాల్సిన చోటుకు వెళ్లి, అక్కడున్న హవాలా సభ్యుడికి ఆ నోటు ఇస్తారు. నోటు మీద ఉన్న సీరియల్ నెంబరే నగదు లావాదేవీల కోడ్‌గా పరిగణిస్తారు. కోడ్ సరిపోలితే నోటు తెచ్చిన వ్యక్తికి హవాలా సొమ్ము మొత్తం ఇచ్చేస్తారు. ఇలా రూ.10 నోటే హవాలా రాకెట్‌లో ప్రధాన భూమిక పోషిస్తోంది. దీన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి గుంతకల్‌కు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్న రూ.కోటి నగదును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
విజయవాడకు చెందిన ఇంద్రసింగ్, అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఉదయ్‌కుమార్ సెల్‌ఫోన్ల వ్యాపారం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఉదయ్‌కుమార్ గుంతకల్లు నుంచి విజయవాడ వచ్చాడు. ఇంద్రసింగ్‌తో కలిసి కోటి రూపాయలు రెండు బ్యాగ్‌ల్లో సర్దుకుని, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు చేరుకుని, గుంతకల్లు బస్సు ఎక్కే ప్రయత్నంలో ఉండగా, టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ వర్మ బృందం దాడిచేసి పట్టుకుంది. ఇంద్రసింగ్‌ను, ఉదయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి కీలకమైన మరో వ్యక్తి గుంతకల్లులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు వ్యాపారంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్టు తేలింది. ఎలాంటి లెక్కాపత్రాలు లేకుండా రహస్యంగా తరలించడానికి ఇదే కారణమని గుర్తించారు. నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. వీరిని తనిఖీ చేయగా రూ.కోటి నగదు దొరికింది. వీరిద్దరూ చరవాణులు వ్యాపారం చేసే వారిగా గుర్తించారు. వీరిద్దరూ కాక గుంతకల్‌లో ప్రధాన సూత్రధారి ఒకరు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నగదు మొత్తం ఎక్కడిది? ఎక్కడి నుంచి సేకరించారు? ఎవరికి ఇస్తున్నారు? తదితర విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ నగదును విజయవాడలో పలువురి నుంచి సేకరించినట్లు సమాచారం. ఇదంతా లెక్కల్లో ఉన్న సొమ్మా? లేక నల్లధనమా? అనేది తేలాల్సి ఉంది. గుంతకల్‌కు చెందిన ప్రధాన సూత్రధారి పట్టుపడితే.. ఇది ఎవరి సొమ్ము అనేది తేలిపోతుందని పోలీసులు అంటున్నారు.