తెలుగు తేజం : ఏలూరు బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వింత వ్యాధితో మొత్తం 3కు మృతుల సంఖ్య చేరింది. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితులు మృతి చెందారు. ఏలూరులో వింత వ్యాధికి గురై పరిస్థితి విషమించడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ ఆస్పత్రిలో 30 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో సుబ్బరావమ్మ(56), అప్పారావు(50) మృతి చెందారు. సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు చెబుతున్న వైద్యులు చెబుతున్నారు. వింత వ్యాధితో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య బుధవారం బాగా తగ్గింది. మధ్యాహ్నం వరకు 18 మంది మూర్ఛ, వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొత్తగా కేసులేమీ రాలేదు. బుధవారం వచ్చిన 18 మందితో కలిసి ఈ సమస్యతో ఆసుపత్రి పాలైన వారి సంఖ్య 587కి చేరింది. ఇందులో 511 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. 43 మంది ఏలూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం 33 మందిని విజయవాడ తరలించారు. బుధవారం కొత్తగా లంకపేట, ఆముదాల అప్పలస్వామి కాలనీ, భీమడోలు ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసు నమోదైంది. వ్యాధి వ్యాప్తికి కారణాలపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు.