విజయవాడ (తెలుగు తేజం ప్రతినిధి): విఐటి -ఏపి విశ్వ విద్యాలయం ప్రాంగణ ఎంపికలు సాధించిన విద్యార్థులను శనివారం విజయవాడలోని తాజ్ గేట్వే హోటల్లో కృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ జె. నివాస్ సమక్షంలో సత్కరించింది. ఈ సందర్భంగా జె. నివాస్ మాట్లాడుతూ ఈ సన్మాన కార్యక్రమంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని నాణ్యమైన విద్యకు చిరునామా విఐటి -ఏపి విశ్వ విద్యాలయం అని తెలియచేసారు. అతి తక్కువ సమయంలో ఇటువంటి ప్రాంగణ ఎంపికలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. ఉపాధి కల్పించిన సంస్థలో నిజాయితీ, నిబద్దతతో పనిచేసి సంస్థ అభివృద్ధిలో భాగం కావాలని తెలియచేశారు. విద్యను అందించిన విశ్వవిద్యాలయాన్ని మరువకూడదని, సమయం వచ్చినప్పుడు విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేయాలని తెలియచేసారు. వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి కోట రెడ్డి మాట్లాడుతూ “దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలు మరియు ఎంఎన్సీల్లో మా విద్యార్థులు ఉద్యోగాలు సాధించటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థుల నిరంతర కృషి మరియు విశ్వవిద్యాలయం అందించే నాణ్యమైన విద్య వల్లే ఈ ఫలితాలు సాధించామని తెలియచేసారు. రాబోయే సంవత్సరాల్లో బలమైన పారిశ్రామిక బంధాన్ని కొనసాగిస్తూ ప్రపంచానికి బాధ్యతాయుతమైన నాయకులను అందించటమే లక్ష్యం ముందుకు సాగుతామని అన్నారు. 30 అక్టోబర్.2021 నాటికి 193 సూపర్ డ్రీమ్ ఆఫర్లు, 219 డ్రీమ్ ఆఫర్లతో సహా మొత్తం 917 ఆఫర్లతో మొత్తం 535 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు . గత ఏడాది సాధించిన అత్యధిక ప్యాకేజీ రూ. 20 ఎల్ పి ఏ తో పోలిస్తే 166.45 శాతం పెరిగి ఈ సంవత్సరం రూ. 33.29 లక్షల ప్యాకేజీ సాధించటం జరిగింది మరియు బ్యాచ్ యొక్క సగటు జీతం 6.28 (సంవత్సరానికి లక్షలు) నుండి రూ. 6.77 (సంవత్సరానికి లక్షలు)కి పెరిగింది. ఈ ప్రాంగణ ఎంపికలలో కోర్ కంపెనీలతో సహా 121 మంది రిక్రూటర్లు పాల్గొన్నారు. అందులో ఇంటెల్, కెలినెక్స్, రాబర్ట్ బొచ్, ఆల్ స్టమ్ , విసా, మైక్రోసాఫ్ట్, వాల్మార్ట్, ఎడోబ్, అమెజాన్, జె పి మోర్గాన్ చేస్ కం, ఎస్ ఏ పి లాబ్స్, గోల్డ్ మాన్ పిలిప్స్, ఐబిఎమ్, కంవల్ట్, ,డెలాయిట్, ఫార్మాసి, పెప్సీ. కం గ్లోబల్ బిసినెస్ సర్వీసెస్, విఎం వేర్ మొదలైన దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి ,
రిజిస్ట్రార్ డాక్టర్ సిఎల్వి శివకుమార్ మాట్లాడుతూ దేశంలోని అగ్రశ్రేణి రిక్రూటర్లచే ఎంపిక కాబడిన విద్యార్థులు కలిగి ఉండటం విద్యార్థుల ప్రతిభ మరియు విశ్వవిద్యాలయ నిబద్దత తార్కాణమని , అందువల్లే విఐటి -ఏపీ విశ్వ విద్యాలయం రిక్రూటర్లచే అత్యంత ప్రాధాన్యతనిచ్చే నియామక గమ్యస్థానాలలో ఒకటిగా ఉందని అన్నారు. విఐటి -ఏపీ విశ్వ విద్యాలయం లింగ వైవిధ్యంలో ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే అత్యుత్తమమైనది, ఈ బ్యాచ్లో 30% మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు, వీరంతా అగ్రశ్రేణి కంపెనీలలో అద్భుతమైన ఆఫర్లను పొందగలిగారని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, విద్యార్థులు, డీన్లు, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.