ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
తెలుగు తేజం, నందిగామ : నందిగామ పట్టణం, హనుమంతుపాలెంలో పట్టణ పరిధిలోని ఇళ్ల స్థలాల పట్టాల లబ్ధిదారులకు కేటాయించిన వైయస్సార్ -జగనన్న కాలనీకి ఎమ్మెల్యే డా.మొండితోక జగన్ మోహన్ రావు మంగళవారం అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ పట్టణ పరిధిలోని 20 వార్డుల లబ్ధిదారులకు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశామని కుల-మత-రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం పట్టా అందించామన్నారు. నందిగామ పట్టణ పరిధిలో దాదాపు 2, 560 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి, మొదటి విడతలో సుమారు సగం మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణాలకు మంజూరు పత్రాలను కూడా అందజేశామని, త్వరలోనే ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. నందిగామ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి 20 వార్డుల నుండి లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి, ఎంతో సంతోషంతో ఇంటి స్థలం పట్టా అందుకుని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారన్నారు.