అమరావతి : రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో అక్రమాలపై ప్రభుత్వం కన్నేర్ర చేసింది. సచివాలయాల్లోన అవినీతికి పాల్పడే సిబ్బంది పై చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ప్రజల వద్దకు పాలన, ప్రభుత్వ పథకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించారు. రాష్ట్రంలో సచివాల వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటరీ ఈ వ్యవస్థను సంధానం చేస్తూ అనేక ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక మొదలు అనేక సంక్షేమ పథకాలు అమలుకు సచివాలయ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పొరపాట్లు జరగకుండా పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న గ్రామ వార్డు సచివాలయాల్లో కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడటం ఇటీవల కాలంలో వెలుగు చూసింది రాష్ట్రంలోని ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలో కొందరు ఉద్యోగులు ప్రభుత్వ సొమ్మును ఖజానాకు జమ చేయకుండా సొంతానికి వాడుకున్న ఘటనలు వెలుగు చూశాయి. మరి కొన్ని చోట్ల లబ్ధిదారుల నుండి లంచం వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు నిర్దేశించిన సచివాలయ వ్యవస్థలో అవినీతిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. రానున్న రోజుల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే సచివాలయ వ్యవస్థలో అవినీతి కట్టడికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. వీరిపై చర్యలు తీసుకునేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారులకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. నిధుల దుర్వినియోగం అవినీతికి సంబంధించిన ఉద్యోగులపై జిల్లా కలెక్టర్లకు వీరు నివేదికలు పంపాల్సి ఉంటుంది. కలెక్టర్ల ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం నిర్దేశించింది.