హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయం క్రమంగా హీటెక్కుతున్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్. ప్రచారంలోనూ దూసుకుపోతున్నది. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఓటర్ను రెండు సార్లు కలవాలని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ నాయకులు ఇప్పటికే ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇక పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంలోకి దిగనున్నారు. నేడు హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ ప్రచారానికి శ్రీకారం చుడతారు. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ గడ్డపై ఎన్నికల సమర శంఖం పూరిస్తారు. 17 రోజుల్లో 42 సభలతో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ బస్సును సిద్ధం చేశారు. అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో ఈ బస్సు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈ బస్సును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బహుమతిగా ఇచ్చారు. దీంతో కొన్నిరోజుల క్రితమే అది యూపీ నుంచి రాష్ట్రానికి చేరింది. ఈ బస్సు నేటి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణ రోడ్లపై పరుగులు పెట్టనుంది. అందులో భాగంగా ఈ రోజు హుస్నాబాదుకు ప్రచార రథం చేరుకోనుంది.