కేంద్రం ప్రతిపాదనలకు రైతుల తిరస్కారం
మద్దతు ధరకు చట్టబద్ధత ఎక్కడ?
దిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు పట్టుపడుతుండగా, అందుకు కేంద్రం ససేమిరా అంది. సవరణలే తప్ప, రద్దులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇందుకు అన్నదాతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిరసన తెలుపుతూ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయాలని నిర్ణయించారు. చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తామంటూ కేంద్రం పంపిన ప్రతిపాదనలను తిరస్కరించారు. హోం మంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ చట్టాలపై వివరణను, చేయదలచిన సవరణలతో 20 పేజీల ప్రతిపాదనలను బుధవారం రైతు నేతలకు పంపించింది. వీటిపై సింఘు సరిహద్దులో రైతు సంఘాలన్నీ చర్చించాయి. ఇవన్నీ పాత వివరణలేనని, ఇవేవీ తమకు అంగీకారయోగ్యం కావని స్పష్టం చేశాయి. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకపోవడాన్నీ తప్పుపట్టాయి. అనంతరం క్రాంతికారీ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు ధర్శన్‌పాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో చర్చల పూర్వాపరాలను వివరించారు. ”కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో అయిదు దఫాలు చర్చించిన తర్వాత కొత్తగా మీతో చర్చలు మొదలు పెట్టడానికి మేం ఇష్టపడటంలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు చెప్పాం. అయితే ఆయన ‘ఈ ఒక్కసారి చర్చించండి, చట్టాల్లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామ’ని చెప్పారు. ‘తప్పు జరిగిపోయింది. అందువల్ల ఇద్దరం కలిసి సరిదిద్దుదామ’ని పేర్కొన్నారు. మూడు చట్టాలను రద్దుచేసి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశాం. ఆయన సవరణల ప్రతిపాదనలే పంపారు. వాటిని పూర్తిగా తిరస్కరించాం” అని పేర్కొన్నారు. అఖిలభారత రైతాంగ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) మరో ప్రకటన విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వ అహంకారపూరిత ప్రతిపాదనలను పూర్తిగా తోసిపుచ్చినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న రైతుసంఘాలు ఇతర సంఘాల మద్దతుతో అన్ని జిల్లా, రాష్ట్ర రాజధానుల్లో నిరవధిక ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపింది. రైతుల అభిప్రాయం వెల్లడయిన తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.