అమరావతి : వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న 125 అడుగుల డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ నడిబొడ్డున ఈ విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాటు చేయడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని, వారి ఆత్రుత, ఆదేశాల మేరకు డిల్లీలో రూపొందుతున్న డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించేందుకు మంత్రుల కమిటీ అక్కడకు వెళ్లడం జరిగిందన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ బావజాలాన్ని భుజాన వేసుకుని, వారి ఆశయాల సాధనకు అనుగుణంగా సామాజిక విప్లవానికి తెరతీస్తూ పలు వినూత్న పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సామాజిక తత్వవేత్తగా ఎంతగానో కృషిచేస్తున్నారన్నారు.
అంతేగాక, మూడు ప్రాంతాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతోనే మూడు రాజధానుల విదానాన్ని తమ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదని, ఈ అంశంపై చర్చించేందుకు గురువారం నుండీ జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నాయకులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.