తెలుగు తేజం, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈనెల 25న 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అదే రోజు 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులతో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాలు పంపిణీ, నిర్మాణంపై సమావేశంలో చర్చించారు.
నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఫ్లాట్లపై తాజా రాయితీల కోసం అదనంగా రూ.482 కోట్లు భరించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. 300 చదరపు అడుగుల ఫ్లాట్లు రూపాయికే ఇద్దామని, కోర్టు కేసులతో స్థలాలివ్వలేని చోట్ల లబ్ధిదారులకు లేఖలిద్దామని అధికారులతో చెప్పారు. కేసుల పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖలు ఇద్దామని తెలిపారు.