నూజివీడు : రాష్ట్రవ్యాప్తంగా 2500 కొత్తగా బస్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ సిహెచ్ ద్వారక తిరుమలరావు శుక్రవారం తెలిపారు. సాధారణ తనిఖీలలో భాగంగా నూజివీడు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1500 డీజిల్ బస్సులు కొనుగోలు చేయడంతోపాటు, 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామన్నారు. పర్యావరణహితమైన 800 ఎలక్ట్రిక్ బస్సులు, మొత్తం 2500 బస్సులు విడతలవారీగా రాష్ట్రంలోని అన్ని డిపోలకు పంపడం జరుగుతుందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ అనేక ప్రణాళికలతో ముందడుగు వేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఉత్సవాలకు సంబంధించి అదనపు బస్సు సర్వీసులు, పుణ్యక్షేత్రాలు, తీర్థరామాలు పర్యటించేందుకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సూచనల మేరకు దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులుగా అత్యాధునిక బస్సులను అందించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
పాత్రికేయులపై ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్చార్జి వీరంగం
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మరియు వైస్ చైర్మన్ సిహెచ్ ద్వారకాతిరుమలరావు పర్యటన సందర్భంగా వార్తను కవర్ చేసేందుకు వచ్చిన పాత్రికేయులపై నూజివీడు ఆర్టీసీ డిపోకు చెందిన ట్రాఫిక్ ఇంచార్జ్ రజిని కొద్దిసేపు వీరంగం వేశారు. ఆర్టీసీకి చెందిన కొందరు కార్మికులు ట్రాఫిక్ ఇంచార్జి రజిని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని, రజనీపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. కార్మికుల ఆరోపణల నేపథ్యంలో చర్యలు ఏమి చేపట్టనున్నారని ఆర్టీసీ ఎండి ద్వారకాతిరుమలరావును పాత్రికేయులు ప్రశ్నించగా, క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. అక్కడే ఉండి అన్నీ గమనిస్తున్న ట్రాఫిక్ ఇంచార్జి రజిని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన గురించి అడగవలసిన అవసరం ఏముందంటూ హుంకరించారు. విధినిర్వహణలో భాగంగానే ఆర్టీసీ ఎండీని ప్రశ్నించామని, ఎవరిపై తమకు వ్యక్తిగత ద్వేషాలు ఉండవని పాత్రికేయులు సమాధానం చెప్పినప్పటికీ, పెడచెవిన పెట్టిన రజని రెట్టించిన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను అధికార వైఎస్ఆర్ సీపీలో రాష్ట్ర నాయకురాలిగా చేస్తున్నానని, తనను ఎవరు ఏమీ చేయలేరంటూ ప్రగ్బాలు పలికారు. మొత్తంగా ఈ వ్యవహారంపై పాత్రికేయులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.