రెడ్దిగూడెం, అక్టోబర్ 9: విద్యతోనే మార్పు సాధ్యమని, పేదల జీవితాల్లో వెలుగు నింపాలనే ప్రధాన ఆశయంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యాకానుక పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. రెడ్డిగూడెం జెడ్పీ పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జగనన్న విద్యకానుక పథకం కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. రెడ్దిగూడెం మండలంలో 16 స్కూళ్లను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. మాటతప్పని మడమ తిప్పని నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. దివంగత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. తండ్రి బాటలో తనయుడు సీఎం జగన్ పయనిస్తున్నారన్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో అంబులెన్సులు ఏర్పాటు చేశారన్నారు. ఎన్ని కష్టాలలో వున్నా నవరత్నాల హామీలను సీఎం అమలు చేస్తున్నారన్నారు. హామీల అమలుకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ లను ఏర్పాటు చేశారన్నారు. దీనివల్ల సుమారు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కింద ఆసరా పథకాన్ని అమలు చేశారన్నారు. ప్రయివేటు స్కూళ్లలో చదువు కొనలేక ఇబ్బందులు పడుతున్న పేదల కోసం ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరణ చేపట్టినట్లు వెల్లడించారు. జగనన్న విద్యకానుక కింద ఇస్తున్న వస్తువులు స్వయంగా సీఎం జగన్ స్వయంగా పరిశీలించారని వెల్లడించారు. జగనన్న ప్రభుత్వానికి ముందు…జగనన్న ప్రభుత్వానికి తర్వాత అనే విషయం అందరూ గమనిస్తారని చెప్పారు. టీడీపీ వాళ్ళు కోర్టులకు వెళ్లి ఇబ్బందులు పెట్టడం వల్ల ఇళ్లస్థలాల పంపిణీ తాత్కాలికంగా వాయిదా పడిందన్నారు. రెడ్దిగూడెం మండలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.
దేవినేని ఉమాకు మతి భ్రమించిందన్నారు. జగనన్న ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలు చేసినా దేవినేని ఉమామహేశ్వరరావు జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం జగన్ మైలవరం నియోజకవర్గానికి ఎంతో విలువైన కానుకగా ఇచ్చారని అభివర్ణించారు. హైస్కూలు అభివృద్ధికి రూ.80 లక్షల నిధులు ఇవ్వడమే ఎమ్మెల్యే వసంత పనితీరుకు నిదర్శనమన్నారు. మనలో ఒకనిగా ఎమ్మెల్యే వసంత కలసి పోయి నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.