దిల్లీ: దేశంలో కరోనా క్రియాశీలక కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న యాక్టివ్ కేసులు 8.83లక్షలకు పడిపోయాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో క్రియాశీలక కేసులు 12.65శాతానికి తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 82,753 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 85.81శాతానికి పెరిగింది.
ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,64,018 కరోనా పరీక్షలు నిర్వహించగా 73,272 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దే శంలో మొత్తం కేసుల సంఖ్య 70లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 69,79,424 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న మరో 926 మంది కరోనాకు బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 1,07,416కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 8,57,98,698కి చేరింది.