తెలుగు తేజం, మచిలీపట్టణం : కృష్ణాజిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రకాశం బ్యారేజ్ నుండి వరదనీరు దిగువకు విడుదల కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయచర్యలు, గ్రామాలలో ఉత్పన్నమయ్యే వివిధ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా పంచాయితి అధికారి పి. సాయిబాబు గురువారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీలలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, గ్రామాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు 08672 – 252166 హెల్ప్ లైన్ నెంబర్లకు సమాచారం అందించాలని డి పీ ఓ కోరారు . అక్టోబర్ 13 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు 38 మంది అధికారులు ఈ విధులలో పూర్తిగా నిమగ్నమై ఉంటారని ఆయన తెలిపారు. కృష్ణాజిల్లా పంచాయతీ కార్యాలయం మచిలీపట్నంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొంతమంది అధికారులు ఒక షిఫ్ట్ లో , మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మరికొంతమంది అధికారులు మరో షిఫ్ట్ లో జిల్లాలో పరిస్థితిని సమీక్షించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి చెప్పారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల తీవ్ర నష్టం లేకుండా జాగ్రత్త వహించాలని, ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆయన కోరారు. ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాన్ని పర్యవేక్షించాలని, భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని జిల్లా పంచాయతీ అధికారి పి . సాయిబాబు సూచించారు.