న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,40,541కు చేరింది.
గడచిన 24 గంటల్లో 4,943 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీలో మొత్తం 4,93,419 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 38,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా దేశరాజధానిలో గంటకు ఐదుగురు చొప్పున మృత్యువాత పడుతున్నారు. దీనికిముందు సోమవారం కరోనాతో 121 మంది మృతి చెందారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ పండుగల సీజన్లో కరోనా నియమాలను చాలామంది ఉల్లంఘించారు. అలాగే పెళ్లిళ్లకు కూడా భారీగా హాజరవుతూ కరోనా ముప్పు పొంచివుందన్న విషయాన్నే మరచిపోయారు. అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రజలంతా కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.