ముగిసిన 94 ఏళ్ల బ్యాంకు చరిత
డీబీఎస్ బ్యాంక్ ఇండియాగా కార్యకలాపాలు ఆరంభం
దిల్లీ: 94 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) శుక్రవారం నుంచి తన కార్యకలాపాలను డీబీఎస్ బ్యాంక్ ఇండియాగా నిర్వహించడం ప్రారంభించింది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే బ్యాంకింగ్ సేవలు అందిస్తూ వచ్చిన ఈ తమిళనాడు బ్యాంకు.. డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌లో (డీబీఐఎల్) విలీనంతో తన గుర్తింపును కోల్పోయింది. డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో ఎల్వీబీ విలీనం నవంబరు 27 (శుక్రవారం) నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎల్వీబీ శాఖలన్నీ.. డీబీఐఎల్ శాఖలుగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని కూడా చెప్పింది. మారటోరియం కూడా శుక్రవారం నుంచి ఉండదని ఆర్బీఐ పేర్కొన్న సంగతి విదితమే. ఈ విలీనం పథకం ద్వారా డిపాజిట్‌దార్లకు తమ డబ్బు భద్రతపై స్పష్టత వచ్చినప్పటికీ..
ప్రమోటర్లు, వాటాదార్లు ఒట్టి చేతులతోనే మిగిలారు. రూ.318 కోట్లు విలువ చేసే టైర్-2 బాసెల్-3 బాండ్లను విలీనానికి ముందే, బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం రైటాఫ్ చేయమని ఎల్వీబీని ఆర్బీఐ ఆదేశించడంతో.. మదుపర్లు నష్టపోయారు. ఎల్వీబీ విలీన పథకాన్ని అనుసరించి ఈ బ్యాంకు షేర్లను ఎక్స్ఛేంజీల నుంచి తొలగించారు.
వాటాదార్ల విలువ సున్నాగా మారింది. దీంతో చాలా మంది వాటాదార్లు, బ్యాంకు యూనియన్లు ఈ విలీన ప్రతిపాదనను వ్యతిరేకించడమే కాకుండా, అమలు తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎల్వీబీని ఆర్బీఐ ఉచిత బహుమతి కింద విదేశీ బ్యాంకుకు ఇచ్చిందంటూ ఆరోపిస్తున్నారు. ఎల్వీబీ విలీనాన్ని నిలిపేయాలని ప్రమోటర్లు పిటిషన్ వేయగా.. దానిని బోంబే హైకోర్టు తిరస్కరించడం గమనార్హం.