Breaking News

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి అనుచరుని భూకబ్జా

రిటైర్డు ఆర్మీ అధికారి గపూర్ ఖాన్ ఆవేదన

తెలుగు తేజం, విజయవాడ : ప్రభుత్వం ఆర్మీకోటా కింద చీరాలలోని రామకృష్ణాపురం పంచాయితీ సర్వే నెం.337/1లో తనకు కేటాయించిన 3.50 సెంట్లు స్థలం, అందులో నిర్మించిన ఇంటిని స్వయానా తన మూడవ తమ్ముడు అయిన షేక్ సిద్దయ్య అక్రమించి నీ దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు దిగుతున్నాడని రిటైర్డు ఆర్మీ సుబేదార్ షేక్ గపూర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అండదండలతోనే షేక్ సిద్ధయ్య తన ఇంటి స్థలాన్ని భూకబ్జా చేశాడని తెలిపారు. జిల్లా కలెక్టర్, పోలీసు, ఇతర రెవెన్యూ అధికారులకు ఈ దురాక్రమణ గురించి ఎన్నిమార్లు విన్నవించినా అరణ్యరోదనగా మిగిలిందని విచారం వ్యక్తం చేశారు. 1995 సంవత్సరం నుంచి తన ఇంటి స్థలాన్ని ఖాళీ చేయమని బంధువు మిత్రులతోనూ, స్థానిక పెద్దలతోనూ సంప్రదింపులు జరిపినా ఫలితం శూన్యం అయిందన్నారు. విసిగి వేసారి పోయిన తాను చీరాల సివిల్ కోర్టులో దావా వేశానని, కాగా దావా నెం.187/95 జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోనూ ఆ స్థలానికి తానే యజమానని తీర్పునిచ్చినట్టు తెలిపారు. ఆ స్థలమును తనకు స్వాధీనం చేయాలని 26-3-2002 వ తేదీన కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి వచ్చిన అమీనాను కూడా నా ఇంటిని కబ్జా చేసిన సిద్ధయ్య దుర్భాషలాడి, ఇల్లు ఖాళీ చేయకుండా తిరస్కరించాడని ఈ విషయాన్ని అమీనా కోర్టు దృష్టికి తీసుకురావడంతో వెంటనే పోలీసులు వచ్చి ఆ స్థలములోకి ప్రవేశించి ఆక్రమిత సిద్దయ్యను ఖాళీ చేయించి తనకు ఆ స్థలాన్ని స్వాధీనం చేశారని తెలిపారు. ఈ సంఘటన జరిగిన 20 రోజులకే సిద్దయ్య తన భార్య పేరుతో వేరే ఫోర్జరీ పట్టా తీసుకువచ్చాడు. ఈలోగా నిర్దిష్టమైన హద్దులతో 3.50 సెంట్లు స్వాధీనం చేసుకున్న తాను ప్రహరీ గోడను నిర్మించానని, కాని కొద్ది రోజుల తర్వాత సిద్ధయ్య మరలా నా స్థలంపై కన్ను వేసి ప్రహరీగోడను పగులకొట్టి గేటు నిర్మించాడని తెలిపారు. స్థలం లోపలకు వెళ్లి నేను కట్టించిన ఇల్లును ధ్వంసం చేశాడని, కబ్జా చేసిన స్థలంలో తాను మళ్లీ ఇల్లు నిర్మించుకున్నాడని తెలిపారు. విజయవాడలో ఉంటున్న నాకు ఆలశ్యంగా ఈ సమాచారం తెలియడంతో ఈ భూకబ్జా విషయంపై నేను ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎమ్మార్వోకి, పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అయినా నాకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అండదండలు ఉండడం వల్లే సిద్దయ్య ఈ భూకబ్బాకు పాల్పడే సాహసం చేశాడని నేను విచారణ చేయగా చీరలలోని స్థానికుల నుంచి నాకు సమాచారం వచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి అండదండలతో నన్ను స్థలంలోకి వెళ్లనీయకుండా వస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశాడు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి అండదండలు తనకు ఉన్నా యని సిద్ధయ్య చెప్పుకుంటూ తిరుగుతున్నాడని, 80 ఏళ్ల వయో వృద్ధుడైన నేను అతన్ని ప్రతిఘటించే శక్తి లేక మానసిక క్షోభకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. సోదరుడున్న సానుభూతి కూడా లేకుండా తన మీద కుట్రపూరితంగా వ్యవహరించడం మానవీయతను విచ్చిన్నం చేయడమేనని, సిద్ధయ్య తన స్థలమే కాకుండా కొన్ని ఇతర స్థలాలు కబ్జా చేసి తన భార్య పేరుతో నమోదు చేయించాడని తెలిపారు. ఉమ్మడి ఆస్థి 49 సెంట్లు సర్వే నెంబరు 325/4, (కేసు నెంబరు 4605) ఆ స్థలమును ఒక న్యాయవాదికి విక్రయ అగ్రిమెంట్ చేసి రిజిష్టరు చేయకుండా వ్యతిరేకించాడని, ద్రాక్షారం సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన 22 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి ముందు 2 సెంట్లలో ఇల్లు కట్టాడని చెప్పారు. ఈ కేసులో ప్రతివాది గెలుపొందాడని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఆర్మీకోటాలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించుకున్నాడని గపూర్ ఖాన్ తెలిపారు. సమాజంలో తనవంటి అశక్తులైన వారి ఆస్టిని కబ్జా చేయడం సిద్ధయ్యకు రివాజుగా మారిందని, ఇతని దాష్టీకానికి భయపడి కొందరు తమకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చెప్పుకోవడం లేదన్నారు. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేసి తన స్థలమును దురాక్రమణ చేసిన సిద్ధయ్య పై చర్యలు తీసుకుని తన స్థలాన్ని తనకు అప్పగించేలా ముఖ్యమంత్రి వర్యులకు, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *