తెలుగు తేజం, విజయవాడ : జిల్లాలో కరోనా పాజిటివిటీ తగ్గుముఖం పట్టడం శుభసూచకమని, అయినప్పటీ కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ఆదివారం బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు సుమారు వేల కోవిడ్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం పాజిటివిటీ శాతం డిసెంబర్ లో 1.2 శాతం ఉందన్నారు. అయితే కోవిడ్ వ్యాప్తి రెండవ దశ, ఇతర అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కోవిడ్ ను ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా వ్యవహరించవలసిందే అన్నారు. ఇందులో భాగంగా మాస్కు ధరించడం భౌతిక దూరం పాటించడం వంటివి అమలు చేయాలన్నారు. ఇప్పటికీ ఈ విషయంలో అందరూ చక్కగా పాటించారని తద్వారా జిల్లాలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో సహకరించినందుకు కలెక్టర్ ఇంతియాజ్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు
కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. 50 రకాల వ్యాక్సిన్లు రూపకల్పన జరుగుతుండగా వాటిలో కొన్ని మూడవ దశ, మరికొన్ని ట్రైల్స్, మరికొన్ని లైసెన్స్ పొంది కూడా ఉన్నాయన్నారు. అయితే కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ దశలుగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో భాగంగా వ్యాక్సిన్ శీతలీకరణ సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ వ్యాక్సిన్ ప్లస్-2 నుండి ప్లస్-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచవలసిన అవసరం వుందన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరైతే టీకా పొందుతారో వారి వివరాలు గుర్తించి రిజిస్టర్ చేయడం వంటి ప్రక్రియ ఉంటుందన్నారు. తొలివిడతగా హెల్త్ వర్కర్స్ కు వ్యాక్సిన్ అందించేందుకు ఇంతవరకు జిల్లాలో 33 వేల మంది హెల్త్ కేర్ వర్కర్లను నమోదు చేయడం జరిగిందన్నారు. రెండవ విడతలో పోలీస్, పారిశుద్ధ్య కార్మికులు, తదితర ప్రెంట్ లైన్ వర్కర్లకు, మూడవ విడతలో 50 సంవత్సరాలు వయస్సు పైబడిన వారికి, తదుపరి విడతలో 50 సంవత్సరాల లోపు తదితర వయస్సు కలిగిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూములను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో పోలింగ్ మాదిరిగా 5 గురు సిబ్బందితో కోవిడ్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ నిర్వహించబడుతుందన్నారు