తెలుగు తేజం, జగయ్యపేట : జగయ్యపేట మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం శ్రీకారం చుట్టారు.ఉదయం 10: 30 గంటలకు హెలికాప్టర్ లో గ్రామానికి విచ్చేసి వైయస్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష కార్యక్రమంలో సర్వేనెంబర్ రాయిని జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష’ పైలట్ ప్రాజెక్టు కింద రీ సర్వే పూర్తయిన కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో రైతులు, స్థిరాస్తి యజమానులకు సీఎం స్వయంగా హక్కు పత్రాలను అందజేశారు. తక్కెళ్లపాడు ట్రై జంక్షన్లో పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా సర్వేరాయి నాటిన అనంతరం మీట నొక్కి డ్రోన్లను గాలిలోకి పంపించారు. ఆధునిక విధానంలో రూపొందించిన సర్వే మ్యాపు (గ్రామపటాన్ని) పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల స్టాళ్లను తిలకించారు. సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల విభాగం స్టాల్లో ప్రదర్శించిన 1866 నాటి రీసర్వే సెటిల్మెంట్ రిజిష్టర్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ (ఎఫ్ఎంబీ)లను సీఎం పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా స్టాల్లో ఆధునిక పద్ధతుల గురించి సంస్థ డీజీ గిరీష్‌కుమార్ వివరించారు. ఈ సందర్భంగా సర్వే జరిగిన తీరుతెన్నులను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా గరికపాడు అనుమంచిపల్లి షేర్ మహమ్మద్ పేట గ్రామాల మీదుగా జగ్గయ్యపేట చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ విప్ ఉదయబాను, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.