తెలుగు తేజం, విజయవాడ : ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది విశ్వ జనులు జరుపుకునే వేడుక క్రిస్మస్ అని, క్రిస్మస్ పండుగ ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నదని డిటిసి యం పురేంద్ర అన్నారు. స్థానిక డిటిసి కార్యాలయంలో బుధవారం రవాణా శాఖ ఉద్యోగులు సెమి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిధిగా డిటిసి ఎం పురేంద్ర పాల్గొన్నారు. పాస్టర్ సువర్ణరాజు ప్రార్థన గీతంతో క్రిస్మస్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని డిటిసి యం పురేంద్ర మాట్లాడుతూ ఈ సందర్భంగా తన స్నేహితుడు చెప్పిన “తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు” అను వాక్యం నాకు ఎప్పటికి గుర్తుండిపోతుందని, ఈ వాక్యం నా జీవితంలో ఎంతో ప్రభావం చూపిందన్నారు. ప్రతినిత్యం ఆవాక్యం విది నిర్వహణలో భాగస్వామి అవుతుందన్నారు. యేసు బోధించిన క్షమా, ప్రేమ, కరుణ మార్గంలో అందరిపట్ల మనం నడుచుకున్నప్పుడే మనిషి జన్మకు సార్ధకం అవుతుందన్నారు. మనం విధినిర్వహణలో ఉన్నప్పుడు కూడా మనదగ్గరకు వచ్చిన ప్రజలకు ఎంతో మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ వారి పనులను పూర్తి చేసేవిధంగా మనం ఉన్నప్పుడే దేవుడు చూపిన మార్గంలో నడిచిన వాళ్ళం ఆవుతామన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఆనందంగా ఉందని డిటిసి అన్నారు. రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు మాట్లాడుతూ ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ వేడుకలుగా ప్రపంచమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపు కుంటారన్నారు. దేవుడు క్రీస్తుగా మానవ రూపంలో మానవ జాతి పాపాలను తొలగించడానికి, సక్రమమార్గంలో నడిపించడానికి భూమి పైకి మానవుడిగా అవతరించడన్నారు. అందుచేత క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా జరుపుకుంటారని ఆయన అన్నారు. అనంతరం డిటిసి యం పురేంద్ర క్రోవత్తులను వెలిగించి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ సెమి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలలో ఆర్టీఓలు రామ్ ప్రసాద్, ఎ విజయసారధి, పాస్టర్ కె సువర్ణరాజు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం రాజుబాబు కార్యదర్శి శ్రీమతి పి విజయ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సిహెచ్ శ్రీనివాసరావు, ప్రభాకర్ లింగం ఉద్యోగులు పాల్గొన్నారు.