తెలుగు తేజం, కొండపల్లి : కొండపల్లి మున్సిపాలిటీ ( ఆర్యవైశ్య కళ్యాణ మండపం ) నందు పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వరంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా కన్వీనర్ యం.వి.అంజనేయులు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ సంస్కరణలు వేగం వంతం చేసి మున్సిపాలిటీలు , కార్పోరేషన్ లు స్వయ సమృద్ధి చేసుకోవాలనే సవరణలు వల్ల పట్టణ ప్రజలపై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడబోతున్నాయని , మరో పక్క కరోనా విపత్కర పరిస్థితుల వల్ల ఆర్ధిక మాంద్యం వలన పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారాలు ఇంకా కోలుకోలేదు. పరిశ్రమ ల్లో పని చేస్తున్న ఉద్యోగులకు , వర్కర్స్కు పూర్తి స్థాయిలో జీతాలు లేక అద్దెలు కూడా సక్రమంగా చెల్లించలేకపోతున్నారు. ఈ స్థితిలో పక్కనున్న తెలంగాణా రాష్ట్రంలో 50 శాతం ఇంటి పన్నులో రాయితీ ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆస్తిపన్నులు ఆస్తి విలువ ఆధారంగా నిర్ణయించే ప్రమాదకర కొత్త విధానానికి చట్ట రూపం ఇచ్చారు. మంచినీరు, డ్రైనేజీ, పారిశుద్య నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం ప్రజల నుండే రాబట్టే విధంగా చట్టసవరణలు చేశారు. అందుకనుగుణంగా 196, 197,198 జి.వోలు కూడా విడుదల చేశారు. దీనివలన పట్టణ ప్రజల పైన తీవ్రభారాలు పడతాయి.ఇంటి యజమానులే కాకుండా, అద్దెదారులపైనా ఈ ప్రభావం పడుతుంది. ప్రతి సంవత్సరం భూముల విలువల ఆధారంగా ఆస్తిపన్ను , ధరల పెరుగుదలకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు పెరుగుతాయి. శాశ్వతంగా పన్నుల ఊబిలోకి ప్రజలను దించుతున్నారు. వీటిపై అభ్యంతరాలు ప్రజలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా మున్సిపాలిటీల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఎన్నికైన కౌన్సిళ్లు లేని ఈ సమయంలో అధికారులే తీర్మానాలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. విధానాలను ప్రభుత్వమే రూపొందించి మొక్కుబడిగా అభ్యంతరాలు కోరడం ఆక్షేపణీయం .పాత పద్ధతిలోనే అద్దె ప్రాతిపదికపై ఆస్తిపన్ను విధించాలి. యూజర్ ఛార్జీలు రద్దు చేయాలి. తక్షణమే పన్నుల పెంపు ప్రక్రియ నిలుపుదల చేయాలని కోరుతున్నాము. మున్సిపల్ చట్ట సవరణలు 2020 రద్దు చేయాలని కోరారు
డిమాండ్స్ :-
1.ఆస్తి విలువ ఆధారంగా ఆస్తిపన్ను విధించే విధానం రద్దుపర్చాలి.
2.నోటిఫికేషన్లు నిలుపుదల చేయాలి.
3.పన్ను పెంపు ప్రక్రియ ఆపివేయాలి.
4.యూజర్ ఛార్జీలను ఉపసంహరించాలి.
5.196 , 197 , 198 జివోలను రద్దు చేయాలి.
6.కరోనా తీవ్రత దృష్ట్యా ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ ఇవ్వాలి.
7.స్థానిక సంస్థలకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల బకాయిలు చెల్లించాలి.
8.నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునరుద్ధరించాలి.
*ఈ కార్యక్రమంలో కొండపల్లి ప్రముఖులు డాక్టర్ మామిడి సీతారామరావు , నాగార్జున విద్యాసంస్థల చైర్మన్ దేవినేని కిషోర్ , క్రాంతి విధ్యాసంస్థల చైర్మన్ వెనిగెళ్ళ మురళీ మెహన్ , జాకీర్ హుస్సేన్ కాలేజ్ ప్రిన్సిపాల్ షేక్ మహాబాషా , పట్టణ పౌర సంక్షేమ జిల్లా నాయకులు గరికపాటి విజయ్ ప్రకాష్ , సాంబిరెడ్డి , సిఐటియు మండల కార్యదర్శి యం.మహేష్ , పెన్షన్సర్ కామేశ్వర రావు , ఎల్ వెంకటేశ్వరరావు , వివిధ ప్రజాసంఘాలు కె.కుమార్ , కె.బేబీ సరోజని , రామకృష్ణ , బాడిషా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.