ఆన్లైన్లోనే దరఖాస్తులు
అన్నీ సక్రమంగా ఉంటే నేరుగా లీజు జారీ
పారదర్శక, జవాబుదారీ విధానానికి గనుల శాఖ శ్రీకారం
తెలుగు తేజం, అమరావతి: రాష్ట్రంలో క్వారీ లీజుల జారీకి వివిధ విభాగాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ (ఏకగవాక్ష తరహా) విధానానికి భూగర్భ గనుల శాఖ శ్రీకారం చుట్టింది. క్వారీ లీజులు/ రెన్యువల్ కోసం ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తోంది. మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఎవరైనా క్వారీ లీజులు/ రెన్యువల్ కోసం ఆంధ్రప్రదేశ్ భూగర్భ గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న విధంగా సింగిల్ డెస్క్ పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూమిలో లీజు కోసం దరఖాస్తు చేస్తే దానిని సంబంధిత సహాయ సంచాలకులు/ ఉప సంచాలకులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం ఆన్లైన్లోనే ఆ ప్రాంత తహసీల్దారుకు పంపుతారు. తహసీల్దారు దానిని పరిశీలించి గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకుని, వ్యక్తిగతంగా పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే ఆన్లైన్లోనే గనుల శాఖకు ఎన్ఓసీ పంపుతారు.
అటవీ భూమి అయితే..
ఒకవేళ అటవీ భూమిలో లీజు కోసం దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారి ఆ దరఖాస్తును ఆ ప్రాంత డివిజనల్ అటవీ అధికారికి పంపుతారు. ఆయన నిబంధనలను పరిశీలించి, దరఖాస్తుదారు ప్రత్యామ్నాయ భూమికి, ప్రత్యామ్నాయ వనీకరణ కింద నిధులు జమ చేసేందుకు అంగీకరిస్తే అటవీ శాఖకు నివేదిక పంపుతారు. అటవీశాఖ దానిని పరిశీలించి అనుమతిస్తుంది. ఎక్కువ విస్తీర్ణమైతే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో లీజుల జారీకి నిబంధనలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సింగిల్ డెస్క్ పోర్టల్’విధానం అమల్లోకి తెచ్చామని గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి తెలిపారు. దీనివల్ల దరఖాస్తుదారుల డబ్బు, సమయం కూడా ఆదా అవుతాయని చెప్పారు.