22 రోజుల తర్వాత దాదాపు 14వేల కేసులు
దిల్లీ: దేశంలో గతకొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కరోనా మహమ్మారి తాజాగా మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 22 రోజుల తర్వాత కొత్త కేసులు మళ్లీ దాదాపు 14వేలకు చేరాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 75శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 13,993 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387కి చేరింది.
ఇదే సమయంలో కొత్త కేసుల కంటే రికవరీలు తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 10,307 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,06,78,048కి చేరింది. రికవరీ రేటు 97.27శాతంగా ఉంది. ఎప్పటిలాగే క్రియాశీల కేసులు 2శాతానికి దిగువనే ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,127 యాక్టివ్ కేసులుండగా.. క్రియాశీల రేటు 1.30శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 101 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,56,212కు పెరిగింది.