తెలుగు తేజం, గుంటూరు: ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ చిత్రంలో పల్లెటూరి వృద్ధుని పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించిన నాగయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం గుంటూరు జిల్లా దేచవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాగయ్య ‘వేదం’ సినిమాలో రాములు పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఆ తర్వాత ఆనేక చిత్రాల్లో ఆయనకు అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ‘వేదం’ చిత్రంలో ‘పద్మ మన పైసలు దొరికాయే..నీ బిడ్డ సదువుకుంటాడే’, ‘ఇళ్లు కట్టేవాడికి ఇల్లుంటుందా, చెప్పులు కుట్టేవాడికి చెప్పులుంటాయా.. మాపరిస్థితి కూడా అంతే’ డైలాగులు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాగయ్య 30కిపైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు.